టీడీపీకి రాజీనామా చేసి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రకటించారు. తెలంగాణ ప్రగతిభవన్ లో నిన్న సీఎం కేసీఆర్ తో సండ్ర భేటీ అయ్యారు. దీంతో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని అంగీకరించారు.
ప్రజల అవసరాలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు సండ్ర తెలిపారు. కేసులకు భయపడే వ్యక్తిని అయితే ఎప్పుడో పార్టీ మారేవాడినని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి చేయడం కష్టంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేరిక తేదీపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా సండ్ర పార్టీ మారితే టీడీపీకి తెలంగాణలో మెచ్చ నాగేశ్వరరావు (అశ్వారావు పేట) ఏకైక ఎమ్మెల్యేగా మిగలనున్నారు.