ఇండ్లలో బ‌యోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

587

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ మంగ‌ళ‌వారం సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండ్లు, కార్యాల‌యాల్లో బ‌యోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. బోయిన్‌పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ తయారు చేసే ప్రాజెక్టును చేప‌ట్టిన ఐఐసీటీ బృందానికి గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు.

విద్యుత్‌, బ‌యోగ్యాస్ ప్లాంట్ ప‌నితీరును గ‌వ‌ర్న‌ర్‌ పరిశీలించారు. ప‌నుల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి విద్యుత్తు, బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయడమనే సరికొత్త ఆవిష్కరణకు బోయిన్‌పల్లి మార్కెట్‌లో నాంది పలికారని కొనియాడారు. ఈ విధానంలో వ్యర్థాలను ఉపయోగించుకోవడం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. ఇలాంటి బ‌యోగ్యాస్ ప్లాంట్‌లు మ‌రిన్ని ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ విన్న‌వించారు.