‘సైరా’ షూటింగ్‌ను అడ్డుకున్న యువకులు.. ఏమైందంటే..

589
blocked the shooting of 'Sira'

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చిత్రీకరణను కర్ణాటకలోని బీదర్‌లో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. బీదర్‌లోని బహుమనీ సుల్తాన్‌ కోటలో చిత్రంలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రయూనిట్‌ ఏర్పాట్లు చేసింది. చిత్రీకరణలో భాగంగా కోటలో హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఐతే ముస్లిం యువకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో షూటింగ్‌ను నిలిపివేశారు. చిత్రీకరణ కోసం కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో హిందూ దేవతల విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారని యువకులు అభ్యంతరం చెప్పారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. హిందూ విగ్రహాలను, చిత్రీకరణకు వేసిన సెట్‌ను తొలగించినట్లు తెలిసింది. కోటకు సంబంధించి అధికారుల నుంచి అనుమతి తీసుకొని షూటింగ్‌ ప్రారంభించినట్లు చిత్రయూనిట్‌ చెబుతోంది.




‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవి కథనాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, నయనతార, తమన్నా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.