సమ్మె బాటలో జొమాటో డెలివరీ బాయ్స్..?

451
delivery boys strike

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు షాక్ తగలనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముస్లిం డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్‌ను హిందూ వ్యక్తి వద్దని చెప్పడంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలి వాన అయి.. ఆ వివాదం సద్దుమణిగింది. ఆహారానికి మతం లేదని వ్యాఖ్యానించి సోషల్‌ మీడియా వేదికల్లో ట్రెండింగ్‌లో నిలిచిన జొమాటోకు ఇప్పుడు తమ డెలివరీ బాయ్స్ రూపంలోనే మరొక షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది.

తాము సరఫరా చేస్తున్న ఆహారం తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ జొమాటో డెలివరీ బాయ్‌లు సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా బీఫ్‌, ఫోర్క్‌ను సరఫరా చేసేందుకు వారు నిరాకరిస్తున్నారు. పే ఆర్డర్‌ను సవరించడంతో పాటు తమ ఉద్యోగుల మత విశ్వాసాలతో చెలగాటమాడటం మానుకోవాలని ఉద్యోగులు జొమాటోను డిమాండ్‌ చేస్తున్నారు.

తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉండే ఆహారాన్ని సరఫరా చేయబోమని చెబుతూ, చాలా సందర్భాల్లో తాము ​పందిమాంసం డెలివరీ చేయాల్సి వస్తోందని ముస్లిం డెలివరీ బాయ్స్‌ వీటిని డెలివరీ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. హిందూ, ముస్లిం ఫుడ్‌ డెలివరీబాయ్స్‌ అందరూ సోమవారం నుంచి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. తమ డిమాండ్లపై తాము ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకూ వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని వెల్లడించారు. ఇటీవల కొన్ని ముస్లిం రెస్టారెంట్లును ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లో యాడ్‌ చేశారని, అయితే వీటి నుంచి బీఫ్‌ను సరఫరా చేసేందుకు కొందరు హిందూ డెలివరీ బాయ్‌లు నిరాకరిస్తున్నారని జొమాటో ఫుడ్‌ డెలివరీ ఉద్యోగి చెప్పుకొచ్చారు.

దేశంలోని అనేక నగరాలతోపటు ప్రముఖ పట్టణాల్లోనూ జొమాటో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్లు తీసుకుని డెలివరీలు ఇస్తోంది. ఇందుకు గాను అనేక రెస్టారెంట్లతో జొమాటో భాగస్వామ్యం అయింది. ఇక ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్లను డెలివరీ చేసే బాయ్స్‌లో అనేక మతాలకు చెందిన వారూ ఉన్నారు. అయితే పలు రెస్టారెంట్లలో లభించే పలు ప్రత్యేకమైన వంటకాలను డెలివరీ చేయడం తమ మత విశ్వాసాలను దెబ్బ తీసినట్లు అవుతుందని చెప్పి జొమాటో డెలివరీ బాయ్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతోపాటు తమకు అందుతున్న కమిషన్, మెడికల్, ఇతర సదుపాయాలు కూడా సరిగ్గా లభించడం లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే త‌మ స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జొమాటో డెలివరీ బాయ్స్ సమ్మెకు దిగుతారని తెలుస్తోంది. కాగా దీనిపై జొమాటో ఇంత వరకు స్పందించలేదు.