లాక్‌డౌన్‌లో నష్టపోయిన దానిని తిరిగి సంపాదించుకునేందుకు అన్ని సంస్థలు ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల గురించి చెప్పనవసరం లేదు.
గత 17 రోజులుగా ఇవి పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల వాటి ప్రభావం రవాణా రంగంపై ప్రభావం చూపి నిత్యవసర సరుకుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
లాక్‌డౌన్ తర్వాత వంట గ్యాస్ రెండు వందల రూపాయల వరకు పెరిగినట్టు అంచనా. ఈ పెరుగుతున్న ధరలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పాల ధరలు కూడా పెరగబోతున్నట్టు సమాచారం అందుతోంది. చంటి పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఇంట్లో పాల వినియోగం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో పాల ధర లీటరు 60 రూపాయలు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాటి భారాన్ని వినయోగదారులపై వేయాల్సి వస్తోందని పాల ఉత్పత్తి దారులు అంటున్నారు.
ఇంధనం ధరలు పెరగడంతో పశువుల దాణా రవాణా కోసం, సేకరించిన పాలను విక్రయించడానికి అయ్యే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని పాల ఉత్పత్తి దారులు ఆవేదన చెందుతున్నారు.
దీంతో ఆ రవాణా ఖర్చును ప్రజలపై మోపక తప్పదని ప్రముఖ డెయిరీ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇప్పుడు లీటరు పాలపై రూ. 2 పెరగొచ్చని తెలుస్తోంది.
ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తులో పాల ధర మరింత పెరిగే అవకాశముంది.