నేను ఎమ్మెల్సీని అని చెప్పినా లంచమడిగారు

284
TRS MLC asked for a bribe

రూ.3 వేలు ఇచ్చాకే పోస్టుమార్టమ్‌ చేశారు : మండలిలో బాలసాని లక్ష్మినారాయణ ఆవేదన

మా బంధువు చనిపోతే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. నేను వెంటనే అక్కడికి చేరుకున్నాను. ఎమ్మెల్సీ అని చెప్పినా ఆస్పత్రి సిబ్బంది లంచమడిగారు. ఆస్పత్రి అధికారులు నన్ను నాలుగు గంటలు ఆగమన్నారు. ఆ తర్వాత కాకతీయ మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్లు వచ్చారు. రూ.3 వేలు లంచం తీసుకొని పోస్టుమార్గల్‌ చేశారు. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదే?. చనిపోయిన బాధలో మేముంటే, లంచం ఇస్తేనే పోస్టుమార్టమ్‌ చేస్తామనడం ఎంత వరకు సమంజసం.



 

ప్రజా ప్రతినిధుల వద్దే లంచం తీసుకుంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి?. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతి లేని పాలన సాగుతోందని చెప్తున్నారు. కిందిస్థాయిలో సిబ్బంది మాత్రం యధేచ్చగా లంచం తీసుకుంటున్నారు. వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యుడు డబ్బులు డిమాండ్ చేయడాన్ని శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బాలసాని లక్ష్మీనారాయణ సభ దృష్టికి తీసుకొచ్చారు. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది’అని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంది. ఆయనపై వేటు వేసింది. అయితే దీనిపై తీవ్రంగా స్పందించిన మంత్రి లక్ష్మారెడ్డి సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఎంఈని ఆదేశించారు. ఈ మేరకు విచారణ జరిపిన డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి , మల్లికార్జున్ లను  సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. ఆస్పత్రులను ఆధునీకరించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. లంచం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో బాలసాని లక్ష్మినారాయణకు జరిగిన ఘటన బాధాకరమని అన్నారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశామన్నారు. గతంలో లంచం తీసుకోవడం నిత్యకృత్యంగా ఉండేదని గుర్తు చేశారు. డబ్బు ఇస్తేనే పనులు జరిగేవని చెప్పారు. ఇప్పుడు అక్కడక్కడా లంచం తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వివరించారు. వాటిని అరికడతామని అన్నారు.


గతంలో మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు డబ్బున్న వారికే జరిగేవని చెప్పారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్సలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో మోకాలు మార్పిడి చికిత్సలు 649 ఈస్పత్రుల్లో, కిడ్నీ మార్పిడి 426 ఆస్పత్రులు, లివర్‌ మార్పిడి 14 ఆస్పత్రుల్లో సేవలందుతున్నాయని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.