పశ్చిమబెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.
మరోవైపు బీజేపీ, టీఎంసీ పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ దాడులు జరుగుతున్నాయి.
తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలో బీజేపీ శ్రేణులే టార్గెట్ గా బాంబు పేలుడు సంభవించింది.
బీజేపీకి చెందిన కార్యకర్తలు ఓ పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా వారిపై ప్రత్యర్థులు బాంబులు విసిరారు.
ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఉన్న సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.ఈ ఎన్నికలను బీజేపీ, టీఎంసీ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఎన్నికల్లో గెలిచి పైచేయి సాధించాలని ఇరు పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.