గూగుల్‌లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ సెర్చ్ చేస్తున్నారా… జర భద్రం

556
cyber crime

ఇల్లు ఖాళీ చేయడానికి ప్యాకింగ్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? జాగ్రత్తా… ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల ఫోన్ నంబర్ కోసం వెదికేవారిని సైబర్‌నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఇంటి సామగ్రిని తరలిస్తామని, ప్యాక్‌చేసి.. వాటితో ఉడాయిస్తున్నారు. అలాగే సామగ్రికి ఇన్యూరెన్స్ కట్టాలని వేధిస్తున్నారు. ఈ తరహాలో మోసపోయిన కుటుంబాలు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో సైబర్ మాయగాళ్ల నయా ఎత్తుగడ వెలుగులోకి వచ్చింది.

చీటింగ్ జరిగింది ఇలా…

హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన రాజు ఇటీవల ఉద్యోగ నిమిత్తం బెంగళూరుకు మకాం మారుస్తున్నాడు. దీని కోసం ఇంటి సామగ్రిని తరలించేందుకు గూగుల్ సెర్చ్‌చేసి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థల గురించి ఆరా తీశాడు. ఈ సెర్చ్‌లో ఓ పేరొందిన ప్యాకర్స్ అండ్ మూవర్స్ రూపంలో ఉన్న వెబ్‌సైట్‌లోకి వెళ్లాడు. అందులో ఉన్న ఫోన్ నంబర్‌ను సంప్రదించాడు. అయి తే వారు.. మీ సామగ్రిని తరలిస్తామని, అయితే ముందుగా రూ.4500 కట్టాలని తెలిపారు. దీంతో రాజు ఆ డబ్బులు కట్టగానే.. అతనికి ఓ కూపన్ పంపా రు. అందులో ఇంట్లోని సామగ్రిని ప్యాక్ చేయడానికి ఎంత మంది వస్తున్నా రు, వాహనం నంబర్ లాంటి వివరాలు లేకుండానే.. తప్పుడు ఫోన్ నంబన్, లారీ నంబర్‌ను పంపారు. ఇవి చూసుకోకుండానే… రాజు తన ఇంట్లోని సామగ్రిని ప్యాక్ చేసుకునేందుకు వారికి అనుమతి ఇచ్చి… వారు బెంగళూరుకు వెళ్లిపోయారు.

అయితే రెండు రోజులైనా సామగ్రి రాకపోవడంతో అనుమానం వచ్చి రాజు కూపన్‌లోని ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే బోయిన్‌పల్లిలోని అసలు కంపెనీకి వెళ్లి..తాను బుక్ చేసుకున్న కూపన్‌ను చూపించాడు. దీంతో కంపెనీవారు అది మా కంపెనీది కాదని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన రాజు.. తాను బ్రౌజ్ చేసిన కంపెనీ చిరునామా కూకట్‌పల్లిలో ఉందని గుర్తించి అక్కడికి వెళ్లి ఆరాతీశాడు. అది తప్పుడు అడ్రస్సు అని తేలింది. ఈ సమయంలో కూడా సామగ్రి తిరిగి ఇవ్వాలంటే మీరు ఇన్సూరెన్స్ కట్టాలి.. మరో రూ.20 వేలు పంపాలని ఫోన్లు చేస్తున్నారు. అందులో ఇంటి సామగ్రితోపాటు హోండా యాక్టివా, విలువైన వస్తువులు ఉండడంతో ఆందోళన చెంది.. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే విధంగా రాంపల్లి గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా పుణేకు ఇల్లు మారుతుండడంతో.. అతను కూడా ఇదే విధంగా గూగుల్ సెర్చ్‌లో ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను సంప్రదించి మోసపోయాడు.

అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి

ఇంట్లో కూర్చుని అన్ని పనులు అయిపోవాలనుకుంటున్న చాలా మంది సైబర్ క్రిమినల్స్ చేతిలో సులభంగా మోసపోతున్నారు. గూగుల్ సెర్చ్‌లో సంబంధిత కంపెనీ వెబ్‌సైట్ కోసం స్క్రోల్ చేసి అదే నిజమనుకుంటున్నారు. కానీ ఇలాంటి సెర్చ్‌ల్లో మీకు 90 శాతం ఫేక్ వెబ్‌సైట్ పేజీలే వస్తాయి. దీంతో చాలా మంది అమాయకులు అసలు, ఫేక్‌ను గుర్తించడంలో గందరగోళానికి గురై నకిలీ వాటిలోనే తమ పేర్లను నమోదు చేసుకుని బోల్తా పడుతున్నారు. ఇలాంటి సెర్చ్‌లో నమోదు చేసే సమయంలో కచ్చితంగా వాటి కార్యాలయాల గురించి తెలుసువాలి. అక్కడికి వెళ్లి ఆరా చేయాలి. మీకు ఆన్‌లైన్‌లో ఇచ్చే రశీదులో ఉండే వివరాలతో పాటు సామగ్రిని ప్యాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వాహన నంబర్, ఫోన్ నంబర్లను సరిచూసుకోవాలి. అనుమానం వస్తే నిలదీసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.