
రెడ్డి సామాజికవర్గం గురించి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన రెడ్ల రణభేరిలో ఆమె మాట్లాడుతూ రెడ్డి అనేది కులం కాదని… అది ఒక టైటిల్ మాత్రమేనని ఆమె అన్నారు.
ఎవరు కష్టాల్లో ఉన్నా వారిని ఆదుకోవడానికి తొలుత వచ్చేది రెడ్లే అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రెడ్ల పరిస్థితి పేరుకే గొప్పగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
రెడ్లలో కూడా ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని అన్నారు. అగ్రవర్ణాల్లో ఎందరో పేదవాళ్లు ఉన్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు.
త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రూ. 5 వేల కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో, నిరుద్యోగులు, ఉద్యోగులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్, టీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి పట్టభద్రులు మోసపోవద్దని అన్నారు.