చైనాలో రజనీకాంత్‌ ‘2.ఓ’ సినిమా రికార్డు!

238

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ సినిమా చైనాలో రికార్డు సృష్టించింది. ఆ దేశంలో అత్యధిక స్క్రీన్లపై విడుదల కాబోతున్న విదేశీ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను సెప్టెంబరు 6న అక్కడ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 47 వేల కంటే ఎక్కువ త్రీడీ స్క్రీన్లపై సినిమా విడుదల కాబోతున్నట్లు పేర్కొంది. ఈ స్థాయిలో చైనాలో విడుదల కాబోతున్న తొలి విదేశీ చిత్రం ‘2.ఓ’ అని తెలిపింది. 47 వేల కంటే ఎక్కువ స్క్రీన్లపై ప్రదర్శించబోతున్న ఈ ఇండియన్‌ భారీ బడ్జెట్‌ చిత్రం చైనాలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్లు విమర్శకులు అంచనా వేస్తున్నారు.

లైకా ప్రొడక్షన్స్‌ హెచ్‌వై మీడియా సంస్థతో కలిసి ఈ సినిమాను చైనాలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తోంది. జులై 12న ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేయాలని నిర్మాత భావించారు, కానీ ఆ సమయంలో హాలీవుడ్‌ సినిమా ‘ది లయన్‌ కింగ్‌’ విడుదల కాబోతుండటంతో ‘2.ఓ’ను వాయిదా వేశారు. ‘రోబో’కు సీక్వెల్‌గా తీసిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయికగా కనిపించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా గత ఏడాది నవంబరులో విడుదలై రూ.800 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం.