ప్యారడైజ్ బిర్యానీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

335
paradise-biryani-name

ప్యారడైజ్ బిర్యానీ. ఈ పేరు వినని వాళ్లు, దీని రుచి తెలియని వాళ్లూ జంటనగరాల్లోనే, యావత్ తెలంగాణలోనూ ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. బిర్యానీ ఓకే. మరి దానికా పేరు ఎలా వచ్చిందో నేటితరం వాళ్లలో చాలామందికి తెలియకపోవచ్చు!

యాభై ఏళ్ల క్రితం సికిందరాబాద్‌లో ప్రారంభమైన చిన్న హోటెల్ ఇది. అప్పట్లో ఇక్కడ ప్యారడైజ్ పేరుతో ఒక సినిమా థియేటర్ ఉండేది. ప్యారడైజ్ అంటే తెలుసుకదా.. స్వర్గం అని అర్థం. సో..అలా ఉండేదనమాట ఈ థియేటర్. ఆ థియేటర్‌కు అనుసంధానంగా చిన్న టీ కొట్టు ఉండేది. ఇరాన్ నుంచి వలస వచ్చిన హుస్సేన్ హిమ్మతీ దాని యజమాని. థియేటర్‌కు అనుసంధానంగా ఉండడం వల్ల దీనికి కూడా ప్యారడైజ్ హోటెల్ అనే పేరొచ్చేసింది. కాలక్రమంలో ప్యారడైజ్ థియేటర్ కనుమరుగైపోయింది. హుస్సేన్ టీ కొట్టు ప్యారడైజ్ హోటల్‌గా ఫేమస్ అయిపోయింది. రుచికరమైన టీ, సమోసా అందించే హోటెల్..ఘుమఘుమలాడే బిర్యానీ అందించే స్థాయికి ఎదిగింది. దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి బిర్యానీని రుచి చూడకుండా వెళ్లరంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయంగా కూడా ప్యారడైజ్ బిర్యానీకి అభిమానులు ఉన్నారు. పదుల మందికి ఉపాధి కల్పించిన ఆ చిన్న హోటెల్..ఇప్పుడు కొన్ని వందల మంది సిబ్బందితో, జంటనగరాల్లో పదుల సంఖ్యలో బ్రాంచులతో ముందుకు సాగుతున్నది. అలా పోతూ పోతూ తన పేరును ఈ హోటెల్‌కు ఇచ్చేసి వెళ్లింది అలనాటి థియేటర్. దానివల్లే ఆ ఏరియా పేరు కూడా ప్యారడైజ్‌గా స్థిరపడిపోయింది. థియేటర్ కనుమరుగైనా.. దాని పేరు మాత్రం చిరకాలం ఉండిపోయేలా కీర్తికెక్కింది. ఇదన్నమాట ప్యారడైజ్ చరిత్ర.