భూమ్మీద ఇంకా నూకలుంటేనే ఇటువంటి సంఘటనల నుంచి తప్పించుకోగలం. ఇందుకు నిదర్శనం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రే. ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ఇండోర్‌లోని డీఎన్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ నేత రమేశ్వర్ పటేల్‌ను పరామర్శించేందుకు ఆదివారం పార్టీ నేతలు సజ్జన్ వర్మ, జితు పట్వారీ, ఎమ్మెల్యే విశాల్ పటేల్, నగర కాంగ్రెస్ చీఫ్ వివేక్ బక్లివాల్‌తో కలిసి కమల్‌నాథ్ వెళ్లారు.
అయితే అందరూ ఒకేసారి లిఫ్ట్‌లోకి ప్రవేశించడంతో అది పది అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందికి జారింది. తర్వాత లిఫ్ట్ డోర్ కూడా మూసుకుపోయింది. అంతేకాకుండా ఆ డోర్ లాక్ అయింది.
దీంతో కమల్‌నాథ్‌తో సహా మిగతా కాంగ్రెస్ నేతలు దాదాపు 15 నిమిషాల పాటు అందులో చిక్కుకుపోయారు. చివరకు టెక్నీషియన్లను పిలిపించి డోర్ తెరిపించారు.
ఈ ఘటన తర్వాత కమల్‌నాథ్ ట్వీట్ చేస్తూ.. హనుమంతుడి దయ వల్ల ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని అన్నారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఇండోర్ కలెక్టర్ మనీశ్ సింగ్‌ను చౌహాన్ ఆదేశించారు.