లక్షలు పోసి కొన్న కారుంటే చాలదు.. అది లక్షణంగా ముందుకుసాగాలి. సామాన్యడి టూ వీలర్ కే కాదు… కోటీశ్వరుడి బెంజ్ కారుకీ తప్పదు టైర్ పంక్చర్ కష్టాలు. ఒక్క పంక్చర్‌తో ఖరీదైన కారు రోడ్డుపై నిలిచిపోతే.!! జేబులో నోట్ల కట్టలున్నా తీరనిదీకష్టం. అప్పుడు కావాలి టైర్‌లో గాలి నింపి ముందుకు సాగేలా చేసి, గమ్యానికి చేర్చే నాథుడు. అదే ఈ మొబైల్ పంచర్ వాహనం. ఆపత్కాలపరిస్థితులకు చెక్‌పెడుతోంది ఈ మొబైల్ టైర్ పంచర్ ఆటో. ఇప్పడు యాదగిరి మొబైల్ టైర్ పంచర్ ఆటోకు నగర శివారులో డిమాండ్ పెరుగుతోంది.
ఉపాధి కోసం కొత్త మార్గం
రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, గున్‌గల్ గ్రామానికి చెందిన యాదగిరి బతుకుదెరువు కోసం వచ్చి వనస్థలిపురంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఉపాధి కోసం యాదగిరి ఓ కొత్త మార్గాన్ని అన్వేషించాడు. అందరిలా కాకుండా మొదడుకు పదునుపెట్టి ప్రయాణికులను తరలించే ఆటోను మొబైల్ పంచర్ వాహనంగా మలిచాడు. అందులో కంప్రెషర్‌ను బిగించి, వాహనాల పంచర్‌కు ఉపయోగించే సామాగ్రిని పొందుపరిచాడు. తన మొబైల్ నంబర్ 9951362145ను బ్యానర్‌పై ఏర్పాటు చేశాడు. అంతే… ఇక యాదగిరి మొబైల్ టైర్ పంచర్ ఆటోకు తిరుగు లేదు. వాహనాల టైర్ పంచర్ కారణంగా ఆపదలో ఉన్న వాహనదారులకు ఈ మొబైల్ వాహనం పెద్ద దిక్కుగా మారింది.
అర గంటలో ..
పంచర్‌తో ఇబ్బందులు పడుతోన్న వాహనదారులు యాదగిరి మొబైల్‌కు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో మీ ముందుంటాడు. పది కిలోమీటర్ల దూరానికి బైక్ పంచర్‌కి రూ. 100, కారు పంచర్‌కు 150 చార్జ్ చేశాడు. మరింత శివారులోకి వెళితే వాహనదారుడు ఇచ్చిన మేరకు డబ్బులు తీసుకుంటాను తప్ప డిమాండ్ చేయనని చెబుతున్నాడు యాదగిరి. రాత్రి వేళలోనూ తన సర్వీస్ ను అందిస్తున్నానని తెలిపాడు. ఆపద సమయంలో ఇతరులకు సేవ చేసే అవకాశం లభిస్తోందని యాదగిరి తెలిపాడు.
సొంతింటి మనిషిగా..
జీవనోపాధి కోసం చేసే కొత్త ప్రయోగం, సామాజిక సేవకూ పని చేస్తోంది. మొబైల్ పంచర్ ఆటోతో డబ్బులతో పాటు సమాజంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆపద సమయంలో టూ వీలర్, ఫోర్ వీలర్ పంచర్ చేసినప్పుడు వారి కళ్లలో ఆనందం నాకు సంతృప్తిని ఇస్తోంది. 2015 నుంచి సాగుతోన్న ఈ ప్రయాణంలో వేలాది మంది కస్టమర్లున్నారు. నా మొబైల్ నంబర్ వారి వద్ద ఉండడంతో తరచూ మాట్లాడుతుంటారు. వాహనాల పంక్చర్ సమయంలో ఫోన్లు చేస్తుంటారు. సొంతింటి మనిషిగా భావిస్తుంటారు.