తల్లి బ్రేక్ ఫాస్ట్ కోసం రైలుని ఆపిన కొడుకు

302
man-pulls-chain-shatabdi-express-mother-finish-breakfast

పిల్లలపై తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో.. పిల్లలకు కూడా తల్లిదండ్రులపై అంతే ప్రేమ ఉంటుంది. ఈ విషయంలో కొందరికి మరీ ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ కొడుకు తన తల్లి కోసం ఏకంగా రైలునే ఆపాడంటే నమ్మగలరా. కానీ ఇది నిజం. తన తల్లి బ్రేక్ ఫాస్ట్ పూర్తి చెయ్యడం కోసం ఆ కొడుకు ఏకంగా రైలునే ఆపేశాడు. బోగీలోని చైన్ లాగి రైలు ఆగిపోయేలా చేశాడు. దీంతో రైలు కాసేపు ఆగిపోయింది. అది మళ్లీ కదిలేలోపు ఆ తల్లి తన బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసింది.

వివరాల్లోకి వెళితే.. తల్లి కోసం రైలుని ఆపిన ఆ కొడుకు పేరు మనీష్ అరోరా(32). ఈస్ట్ ఢిల్లీకి చెందిన మనీష్ తన తల్లితో కలిసి హబీబ్ గంజ్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో వెళ్తున్నాడు. వారు మధురాలో దిగాల్సి ఉంది. కాసేపట్లో రైలు మధురా స్టేషన్ కి చేరుకోవాల్సి ఉంది. అయితే మనీష్ తల్లి బ్రేక్ ఫాస్ట్ చేస్తోంది. అది ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు స్టేషన్ వస్తే దిగిపోవాల్సి ఉంటుంది. ఇది గ్రహించిన మనీష్.. ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా బోగిలోని చైను లాగేశాడు. దీంతో రైలు ఆగిపోయింది. అది మళ్లీ బయలుదేరేలోపు మనీష్ తల్లి తన బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసింది. ఆ విధంగా తల్లి మీద తనకున్న ప్రేమను మనీష్ చాటుకున్నాడు.

కాగా, అకారణంగా రైలు చైన్ లాగడం నేరం. దీంతో రైల్వే పోలీసులు మనీష్ అరోరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మనీష్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇప్పుడీ న్యూస్ సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. తల్లి కోసం కొడుకు చేసిన పనిని అంతా మెచ్చుకుంటున్నారు. నువ్వు గ్రేట్ బాసూ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అమ్మ మీద నీకున్న ప్రేమ చాలా గొప్పదని అంటున్నారు.