తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తెచ్చేందుకు తెలంగాణ తెలుగుదేశం సరికొత్త ప్లానింగ్‌తో ముందుకు వెళుతోంది. 2018 సాధారణ ఎన్నికల్లో రెండు సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీ గత గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క చోటా విజయం సాధించలేదు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్ దక్కించుకోలేదు. ఈ క్రమంలోనే తెలంగాణలో తెలుగుదేశానికి పునర్వైభవం తెచ్చేందుకు తెలంగాణ తెలుగు యువత నడుం బిగించింది.
పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సరికొత్త నిర్ణయాలతో ముందుకు వస్తోంది. యువత తలచుకుంటే సాధ్యం కానిది ఏమీ ఉండదని ఫ్రూవ్ చేసేందుకు తెలంగాణ తెలుగు యువత నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో మళ్లీ పార్టీని ఎలా ? బలోపేతం చేయాలన్న అంశంపై తెలంగాణ తెలుగు యువత అధ్యక్షుడు డాక్టర్ పొగాకు జైరామ్ ఆధ్వర్యంలో తెలుగు యువత అంతా సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే వీరు తెలంగాణ అంతటా సైకిల్ యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. మార్చి 29వ తేదీ నుంచి వీరు తెలంగాణలో ప్రతి జిల్లా.. ప్రతి మండలానికి వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ 39వ ఆవిర్భావ దినోత్సవం రోజునే వీరి యాత్ర ప్రారంభం కానుంది. మాజీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి తనయుడు అయిన జైరామ్ మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ తెలుగు యువత పార్టీ పగ్గాలు కట్టబెట్టగా… ప్రస్తుతం తెలంగాణలో ఉన్న తెలుగు యువత నాయకులు అందరూ కసితో పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరు దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు.
ఈ యాత్రలో తెలంగాణ కార్యవర్గం అంతా పాల్గొననుంది. జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు.. పార్లమెంటరీ నియోజకవర్గ , నియోజకవర్గ కార్యవర్గాలను కలుపుకుంటూ ఈ యాత్ర కొనసాగనుంది. వీరు ప్రతి నియోజకవర్గాన్ని సందర్శించి అక్కడ ఎన్టీఆర్ విగ్రహాలను శుభ్రపరచడంతో పాటు రంగులు వేయనున్నారు. అలాగే పూలమాలలతో ఎన్టీఆర్ విగ్రహాలను అలంకరించనున్నారు. అలాగే తెలుగుదేశం జెండా దిమ్మెలను శుభ్రం చేసి వాటికి కొత్తగా పసుపు రంగులు వేసేలా ప్లాన్ చేశారు.
తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎందుకు రావాలో వివరించనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం వల్ల జరిగిన అభివృద్ధిని కూడా వివరించనున్నారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వైవిధ్య పాలన ఎలా అందిస్తారో వివరిస్తారు. అలాగే త్వరలోనే జరిగే నాగార్జునా సాగర్ ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మం ఎన్నికల్లోనూ పోటీ చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ సైకిల్ యాత్ర తెలంగాణ ప్రజల్లో ఎలాంటి జోష్ నింపి.. పార్టీని నిలబెడుతుందో ? చూడాలి. ఏదేమైనా తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగు యువత చేపట్టే ఈ సైకిల్ యాత్ర హైలెట్ అవుతుందనడంలో సందేహం లేదు.