ప్రపంచ క్రికెట్‌లో ఉన్న విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ కూడా ఒకడు. భారీ షాట్లు ఆడటంలో అతన్ని మించిన క్రికెటర్ ప్రస్తుతం ఎవరూ లేరు. అతడు తనను తాను యూనివర్స్ బాస్‌గా చెప్పుకుంటాడు. తాజాగా మరోసారి గేల్ అలాంటి కామెంట్సే చేశాడు. వరల్డ్‌కప్ తర్వాత రిటైరవుతానని చెప్పిన గేల్.. ఈ సందర్భంగా తానే ప్రపంచంలో గొప్ప ప్లేయర్‌ననీ అన్నాడు. క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మీరు ఓ గొప్ప వ్యక్తిని చూస్తున్నారు. ప్రపంచంలోనే నేనే గొప్ప ఆటగాడిని. నిజంగానే నేను యూనివర్స్ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు. చనిపోయే వరకు ఆ ట్యాగ్‌ను కొనసాగిస్తాను అని గేల్ అన్నాడు. యువకులకు చాన్స్ ఇవ్వడానికే తాను వరల్డ్‌కప్ తర్వాత రిటైర్ కాబోతున్నట్లు గేల్ చెప్పాడు.
వరల్డ్‌కప్ తర్వాత తప్పుకోవాలని అనుకుంటున్నది నిజమే. 50 ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్‌కప్ నా చివరి టోర్నీ. ఆ తర్వాత యువకులకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను అని గేల్ చెప్పాడు. వరల్డ్‌కప్ గెలిచి రిటైరవడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది. అందుకే యువకుల ఆ ట్రోఫీని నాకు అందించాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు నా కోసం ఆ పని కచ్చితంగా చేయాలి. నేను కూడా నా వంతుగా రాణిస్తాను అని గేల్ తెలిపాడు. 39 ఏళ్ల గేల్.. వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పాడుగానీ.. టీ20ల్లో కొనసాగుతానని హింట్ ఇచ్చాడు. 2020లో జరిగే టీ20 వరల్డ్‌కప్ ఆడతానని చెప్పాడు.