కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాల అంశంపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు లేవనెత్తాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని విపక్షాలు డిమండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఆజాద్ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ఢిల్లీలో ఉద్యమం చేపట్టిన కొందరు రైతులు అదృశ్యమయ్యారని ఆజాద్ ఆరోపించారు. జనవరి 26 నుంచి అదృశ్యమైన వారి గురించి ఒక కమిటీని వేయాలని ప్రధాని మోదీని కోరుతున్నామని చెప్పారు.
రిపబ్లిక్ డే రోజున జరిగిన హింసను తాము ఖండిస్తున్నామని ఆయన అన్నారు. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.