
రాసలీలల ఆరోపణలతో కర్ణాటక బీజేపీ నేత రమేశ్ జార్కిహోళి తమ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఆయన తనకు ఏ పాపమూ తెలియదన్నారు.
తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన గోడు వినిపించారు. తనను బలిపశువును చేశారని కన్నీరు పెట్టుకున్నారు.
తనను ఇబ్బందుల పాలు చేసేందుకు విపక్షాలే ఈ వల పన్నాయని ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే నాపై కుట్ర పన్నారని అన్నారు.
దీని నుంచి తాను నిర్దోషిగా బయటపడతానని ధీమా వ్యక్తం చేశారు. నకిలీ సీడీ సృష్టించి తన పరువుకు భంగం కలిగించిన వారిని ఊరకనే వదలబోనని హెచ్చరించారు.
తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు నెలలు కూడా పదవిలో ఉండవంటూ ఓ నాయకుడు తనకు సవాల్ విసిరారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
సీడీలో కనిపించిన యువతికి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందన్నారు.
నిజానికి ఆమెకు రూ. 5 కోట్లతోపాటు విదేశాల్లో రెండు ఫ్లాట్లు కూడా ఇచ్చినట్టు తన వద్ద సమాచారం ఉందన్నారు.
తనకు మంత్రి పదవి కంటే పరువు, మర్యాదలే ముఖ్యమన్నారు. ఏడాదిలోనే పదవికి దూరమయ్యానన్న బాధకంటే నిందలు భరించడమే కష్టంగా ఉందన్నారు.