మ‌నిషా.. మృగ‌మా…

205

ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అంతటితో ఆగ‌క ఆగ‌క కసి తీరక అందరూ చూస్తుండగా ఆమెపై నుంచి కారును పోనిచ్చాడు. అదే కారులో పరారయ్యాడు.

అయితే.. ఎట్టకేలకు పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. తమిళనాడులో పట్టపగలు ఘోరం జరిగింది. 35 ఏళ్ల వ‌య‌సున్న ఓ డాక్ట‌ర్ చేసిన ఘాతుక‌మిది.

నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో తమిళనాడు ఉలిక్కిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విలుప్పురం జిల్లా తిన్దివనమ్‌కు చెందిన డాక్టర్ గోకుల్ కుమార్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసేవాడు.

లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగానికి పోయింది. గోకుల్‌కు మూడేళ్ల క్రితం కీర్తనతో (28) వివాహమైంది. ఆమె ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తోంది. పెళ్లి తర్వాత కీర్తన తల్లిదండ్రులు కూడా కూతురి వద్దే ఉంటున్నారు.

దీంతో గోకుల్, కీర్తన దంపతులు ఆమె తల్లిదండ్రులతో కలిసి ఆనంద్‌నగర్‌లో ఇల్లు తీసుకుని నివ‌సిస్తున్నారు. ఈ దంప‌తులు కొంత కాలం అన్యోన్యంగానే ఉన్నారు. గత సంవత్సర కాలంగా వీరి మధ్య గొడవలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ గొడవలు కాస్తా విడాకులకు దారితీశాయి. ఆరు నెలల క్రితం వీరు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరి మ‌ధ్య మ‌ళ్లీ గత శుక్రవారం సాయంత్రం గొడ‌వ జ‌రిగింది.

ఒకానొక సమయానికి ఈ గొడవ తారాస్థాయికి చేరింది. క్షణికావేశంలో కిచెన్‌లో ఉన్న కత్తితో గోకుల్ కీర్తన గొంతు కోశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రిని కూడా గోకుల్ గాయపరిచాడు.

తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న కీర్తనను గోకుల్ జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత వేగంగా కారు నడుపుకుంటూ వచ్చి పైనుంచి పోనిచ్చాడు.

దీంతో కీర్తన అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అదే వాహనంలో గోకుల్ పరారయ్యాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇరుగుపొరుగు జనం పోలీసులకు సమాచారమందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన కీర్తన తల్లిదండ్రులను ఆసుపత్రికి తరలించారు. ప‌రారైన గోకుల్‌ను ప‌ట్టుకునేందుకు చెన్నై నేషనల్ హైవే పరిధిలోని పోలీస్ స్టేషన్లలన్నింటినీ అలర్ట్ చేశారు.

చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న గోకుల్ కారును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భార్యను చంపిన భయంలో ఉన్న గోకుల్ కారు వేగాన్ని అదుపు చేయలేక టోల్‌బూత్‌ను ఢీ కొట్టాడు.

ఈ ఘటనలో గోకుల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించిన పోలీసులు త‌ర్వాత అతనిని అరెస్ట్ చేశారు.