పుదుచ్చేరిలో నాలుగేళ్లకు పైగా ప్రజలకు పాలనను అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి విఫలమయ్యారు.
తగిన సంఖ్యాబలం లేకపోవడంతో విశ్వాస పరీక్షకు వెళ్లకుండానే సీఎం సభ నుంచి వెనుదిరిగారు. బల నిరూపణలో విఫలమైన తరువాత, తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
రాజ్ నివాస్‌కు వెళ్లి తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సోందరాజన్ కు అందజేశారు.
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రసంగించిన సీఎం నారాయణ స్వామి భావోద్వేగానికి లోనయ్యారు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల కోసం రాత్రింబవళ్లూ పనిచేశామని ఆయన తెలిపారు.
తన ప్రభుత్వాన్ని బీజేపీ, ఆ పార్టీ నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కుప్పకూల్చారని ఆయన ఆరోపించారు.
కిరణ్ బేడీ ఎల్జీగా నియమితురాలైన నాటి నుంచి విపక్ష ఎమ్మెల్యేలకే మద్దతుగా నిలిచి, సంక్షేమాన్ని వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకున్నారని మండిపడ్డారు.