
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బండి ఇప్పటికే ఓవర్ లోడ్ అయ్యింది. విపక్ష పార్టీల నుంచి కేసీఆర్ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి షాకులు ఇస్తారో ? ఎవరిని అందలం ఎక్కిస్తారో ? అర్థం కాని పరిస్థితి. కేసీఆర్ వరుసగా చేయిస్తోన్న సర్వేలో నేపథ్యంలో ఓ 25 మంది ఎమ్మెల్యేలపై మాత్రం తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఖమ్మం జిల్లాలో 2-3, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5-6, గ్రేటర్ పరిధిలో 8-10, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 5 గురు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని వార్తలు వస్తున్నాయి.
అయితే కేసీఆర్ ఇటీవల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఒకరిద్దరు సిట్టింగ్‌లకు మినహా మిగిలిన వారందరికి టిక్కెట్లు వస్తాయని చెప్పారు. ఈ ఒక్క మాటతో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశలు పెట్టుకున్న చాలా మంది గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలు అయిపోవాలని కలలు కనేవాళ్ల లిస్ట్ చాలానే ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ డెసిషన్‌తో చాలా మంది షాక్‌లో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేరుకు 12 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మూడు ఎస్టీ, రెండు ఎస్సీ పోగా 7 జనరల్ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. అన్ని పార్టీల్లోనూ పోటీ తీవ్రంగా ఉన్నా అధికార టీఆర్ఎస్‌లో అయితే ఈ 7 సీట్లకు కనీసం 15 మందికి పైగా ప్రధాన అభ్యర్థులు కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ తూర్పు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కూడా పోటీ పడుతున్నారు.
ఇక ఇక్కడ టిక్కెట్ తనకు వచ్చేది లేదని డిసైడ్ అయిన సారయ్య మళ్ళీ సొంత గూటికి చేరడం దాదాపు ఖరారైంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సారయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మంచి గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పార్టీ మారారు. అయితే టీఆర్ఎస్‌లో ఆయన ఎప్పుడూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయనకు పార్టీలోనూ గౌరవం లేదు. ఇటు పార్టీలో గౌరవం లేకపోవడం, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని తేలిపోవడంతో సారయ్య తిరిగి హస్తం కిందకు చేరిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. సారయ్య కాంగ్రెస్‌లోకి రివర్స్ జంప్ చేస్తే అది కేసీఆర్‌కు పెద్ద షాకే అనుకోవాలి.