విమానం న‌డుపుతూ నిద్రపోయిన పైలట్..వీడియో

318
pilot of a sleeping

విమానం టేకాఫ్ తీసుకున్నాక… విమానం గాల్లో ఉండగానే ఓ పైలట్ కాక్‌పీట్‌లోనే నిద్రపోయాడు. విమానం న‌డుపుతూ పైలట్ నిద్రపోతుండగా.. ఆ ఘ‌ట‌న‌ను వీడియో తీసిన‌ కోపైలట్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది. చైనా ఎయిర్‌లైన్స్ సంస్థ‌ తైవాన్స్ నేషనల్ క్యారియర్‌కు చెందిన బోయింగ్ 747 మోడల్ విమానం పైలట్ వెంగ్ జియాకీ విమానం టేకాఫ్ తీసుకున్నాక ఓ కునుకు తీశాడు. పైలట్ నిద్రపోతుండగా కోపైలట్ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో ఎయిర్‌లైన్స్ అధికారులకు తెలియడంతో వెంటనే ఆ పైలట్‌పై చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. పైలట్ నిద్రపోతుంటే అతడిని నిద్రలేపకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తావా.. అని కోపైలట్‌నూ ఎయిర్‌లైన్స్ సంస్థ‌ మందిలించింది.




 

‘ఆ పైలట్ మా సంస్థలో గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావడం లేదు. కాక్‌పీట్‌లో నిద్రపోవడం తప్పని తనే ఒప్పుకున్నాడు. అయినప్పటికీ.. అతడిపై చర్యలు తీసుకున్నాం. ఈ ఘటనను చిత్రీకరించిన కోపైలట్‌ను కూడా మందిలించాం.. మాకు ప్యాసెంజర్ల సేఫ్టీనే ముఖ్యం. దానికోసం ఏదైనా చేస్తాం.. దాని కోసం రాజీ పడే ప్రసక్తే లేదు..’ అని ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది.

చైనా ఎయిర్‌లైన్స్ పైలట్స్.. తమ వర్కింగ్ అవర్స్ తగ్గించాలని.. తమకు అలసట, ఒత్తిడి ఎక్కువవుతోందంటూ ఏడు రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె ముగిసిన కొన్ని రోజులకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఘటన చైనాలో చర్చనీయాంశమైంది. అయితే.. ఆ ఘటన పైలట్ల సమ్మె కంటే ముందే జరిగినట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ వెల్లడించింది. గత సంవత్సరం కూడా ఇలాగే ఆస్ట్రేలియాలో ఓ పైలట్ కాక్‌పీట్‌లో నిద్రపోవడం వల్ల విమానం రన్‌వే దాటి 50 కిలోమీటర్లు ముందుకు వెళ్లి ఆగింది.