తెలంగాణ సర్కార్ పై బీజేపీ నేత డీకే అరుణ విమర్శలు గుప్పించారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో
ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పట్టభద్రులు సన్నద్ధం కావాలని కోరారు.
ఉద్యోగాల కల్పనపై మంత్రి కేటీఆర్ అవాస్తవాలు చెపుతున్నారని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామని చెప్పుకోవడం సరికాదన్నారు.
కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని గతంలో సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలకు, కేటీఆర్ ప్రకటించిన లెక్కలకు పొంతన లేకుండా ఉందని అరుణ విమర్శించారు.
సింగరేణి సంస్థలో వారసత్వంగా ఇచ్చిన ఉద్యోగాలను కూడా కొత్త ఉద్యోగాల జాబితాలో చేర్చారని మండిపడ్డారు.
కేసీఆర్ పాలనలో నిరుద్యోగం పెరిగిందే తప్ప తగ్గలేదని విమర్శించారు. ఉద్యోగాల అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆమె కేటీఆర్ కు సవాల్ విసిరారు.