తెలంగాణలో భానుడు ఉగ్రరూపానికి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉపరితల ద్రోణి బలహీన పడిపోవడంతో మంగళవారం ఒక్కసారిగా రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది.
సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా భీమిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లంలో నమోదైంది.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మి గ్రామాల్లో 37.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) తెలిపింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33.4 నుంచి 34.2 డిగ్రీల మధ్య నమోదయ్యాయి.
మరి కొన్ని జిల్లాలో రాత్రి పూట చలిగా ఉంటోంది. ఈ క్రమంలో అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.