ఫ్రెండ్‌కి బైక్ ఇచ్చినందుకు… జైలుపాలు

243

ఎవ‌రో త‌ప్పు చేస్తే ఇంకెవ‌రో శిక్ష అనుభ‌వించ‌డ‌మంటే ఇదే.. ఫ్రెండ్ బైక్ అడిగితే కాద‌న‌లేక ఇచ్చాడు. కానీ ఆ ఫ్రెండ్ చేసిన త‌ప్పుకు బైక్ ఇచ్చిన యువ‌కుడు జైలు పాల‌య్యాడు.

డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బైక్‌లు ఇవ్వడం నేరం. వారు ఏదైనా యాక్సిడెంట్ చేసినా లేదా ప్రమాదానికి గురైనా లేదా కార‌కులైనా… వాహనం యజమానిదే బాధ్యత. అతడే నిందితుడు అవుతాడు.

ఈ విషయాన్ని పోలీసులు పదే పదే చెబుతున్నారు. నెత్తీనోరు బాదుకుంటున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.

నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, మైనర్లకు వాహనాలు ఇస్తున్నారు.

ఆ తర్వాత కష్టాల్లో పడుతున్నారు. జైలుకి వెళ్తున్నారు. తాజాగా తన స్నేహితురాలికి వాహనాన్ని ఇచ్చిన ఓ హోటల్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్ ఇప్పుడు ఓ కేసులో ఏ1 నిందితుడిగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

హైద‌రాబాద్‌లో జరిగిన ఈ సంఘ‌ట‌న పూర్వాపరాలు చూస్తే..

గత శుక్రవారం రాత్రి కూకట్ పల్లిలో డెంటల్ విద్యార్థిని రేష్మ స్కూటీని నడుపుతూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల కారణంగా మరణించింది.

ఈ కేసును విచారించిన పోలీసులు రేష్మకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని గుర్తించారు. ఆ వాహనం అజయ్ సింగ్ (23) అనే స్టూడెంట్‌ది అని గుర్తించారు.

స్నేహితురాలే కదా అని అతను ఆమెకు వాహనాన్ని ఇచ్చాడని, ఆ వాహనం లారీని ఢీకొనగా రేష్మ దుర్మరణం పాలైందని తెలిపారు.

ఈ కేసులో నిబంధనల ప్రకారం స్కూటీ యజమాని అజయ్ సింగ్‌ను ఏ1 ముద్దాయిగా (ప్రధాన నిందితుడు), ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ఏ2గా(రెండవ నిందితుడు) పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

అజయ్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఇకనైనా వాహనదారులు మారాలని పోలీసులు కోరుతున్నారు. డ్రైవింగ్ నిబంధనలు ఇప్పుడు చాలా కఠినంగా అమలవుతున్నాయని చెప్పారు.

అందరూ నిబంధ‌న‌లు పాటించాల‌ని చెప్పారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.