పరీక్షకు ముందే వాట్సాప్‌లో పేపర్ లీక్

230
Paper leak WhatsApp before Exam

పరీక్షకు ముందే వాట్సాప్‌లో పదవ తరగతి సోషల్‌ సైన్స్‌ ప్రశ్న పత్రం లీకైంది. ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

గుర్తించిన బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ పరీక్షను రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షను మార్చి 8న నిర్వహిస్తామని ప్రకటించింది.

రాష్ట్రంలో పదో తరగతి బోర్డ్‌ పరీక్షలు గత బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నిన్న సోషల్‌ సైన్స్‌ పరీక్ష జరిగింది.

మొదటి షిఫ్టులో భాగంగా 8,46,504 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రం లీకైందని, వాట్సాప్‌లో షేర్‌ అవుతుందని బీహార్‌ స్కూల్‌ ఎగ్జామినేషన్‌ బోర్డ్‌ (బీఎస్‌ఈబీ) గుర్తించింది.

దీనిపైన విచారణ చేపట్టిన అధికారులు ఝాఝలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కాంట్రాక్ట్‌ ఉద్యోగులు దీనికి పాల్పడినట్లు వెల్లడించారు.

వికాస్‌ కుమార్ అనే కాంట్రాక్ట్‌ ఉద్యోగి పరీక్ష పత్రాలను లీక్‌చేశాడని గుర్తించారు.దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

అతనికి సహాయం చేసిన ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.