ఈ నెల 1 నుంచి 9 ఆ పై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా మార్గదర్శకాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం రోజురోజుకూ పెరుగుతోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై ఆమె గురువారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తరగతులు ప్రారంభించిన రోజున ప్రభుత్వ పాఠశాలల్లో 48 ఉన్న విద్యార్థుల హాజరు 17వ తేదీకి 72శాతానికి పెరిగిందన్నారు.
మోడల్ స్కూల్స్‌లో 69, కస్తూర్బా పాఠశాలల్లో 71, గురుకులాల్లో 85 శాతం హాజరు నమోదవుతుందని చెప్పారు.
ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో హాజరు శాతం అధికంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.
కొవిడ్ మార్గదర్శకాలను ఇలాగే కొనసాగించాలన్నారు. తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని మరింతగా పెంచాలని అధికారులకు సూచించారు.