పట్నం అనగానే ఒక రంగుల ప్రపంచంలా, పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన జీవితం, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, వాహనాల షో రూమ్స్, అన్నీ రకాల విద్యాలయాలు, పార్కులు, పబ్ లు ఇలా ఎన్నో, మరెన్నో కన్పిస్తాయి. మన మిత్రులుగానీ, బంధువులెవ్వరైనా పట్నంలో ఉంటే వారిని ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో, పట్నం వాసులని గౌరవిస్తుంటాము.
కానీ నేటి వర్తమాన కాలంలో పట్టణ సంస్కృతీ, జీవన విధానం గ్రామాలలోకి వచ్చింది . అయినా పట్నంలో విలాసవంతమైన జీవనం గడపాలంటే ధనవంతులు, వ్యాపారస్తులు, ఉద్యోగులకే పరిమితం గానీ పేద, మధ్యతరగతి కుటుంబాలు పడే ఇక్కట్లు వర్ణించలేని విదంగా ఉంటాయి. ఏ పట్టణాన్ని తీసుకున్న అత్యధిక శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున వున్నవారే వుంటారు. వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా అక్షరాస్యత గావించలేక, చదివిన ప్రాథమిక విద్యకే పరిమితమై కుటుంబ పోషణ నిమిత్తం, అవసరాల దృష్ట్యా దినసరి వేతనాలకు వివిధ రకాల పనులను చేస్తూ జీవనం గడుపుతుంటారు.
అక్షరాస్యత కల్గిన కొంతమంది నెలసరి వేతనాలకు పనిచేస్తుంటారు.ఇప్పుడున్న పరిస్థితులలో గ్రామాలలో భూగర్భజలాలు ఎప్పడినుండో అంతరించిపోతున్నాయి, కేవలం నదులు, సరస్సులు, చెరువులు ఉన్నచోట్ల, చుట్టుప్రక్కల, అక్కడక్కడ నీటి సదుపాయం మినహాయిస్తే, మరెక్కడా కనిపీయని పరిస్థితి. వ్యవసాయదారులు వర్షాలపై ఆధారపడి పంటలు వేస్తే, పంట చేతికొచ్చేదాకా నమ్మకంలేని పరిస్థితి, సరైన సమయంలో వర్షాలు కురవకపోతే పెట్టుబడి సైతం మీదపడి, అప్పులపాలై, భూములు, ఆస్తులు అమ్ముకోని పట్నాలకు వలసలు వెళ్ళీ దినసరి వేతనాలకు పనిచేస్తుంటే, ఇంకా గ్రామాలలో భూమిలేని వ్యవసాయ కూలీలు, వివిధ కులవృత్తుల కుటుంబాలు సైతం జీవనోపాధికై పట్నాలలో వలస కూలీలుగా స్థిరపడుతుంటారు.
ఈ విదంగా పట్నాలలో వున్న పేదవారికి అక్కడక్కడ స్థిరనివాసాలు ఏర్పర్చుకున్న, ఇంకొంత మంది పెంకుటిల్లు, గుడిసెలు, టెంట్లతో ఆవాసాలు ఏర్పర్చుకుంటే, గ్రామాల నుండి వలస కార్మికులు మాత్రం మురికివాడలలో, ఏదైనా ఖాళీగా ఉన్నా ప్రభుత్వ స్థలాల్లో, రహదారుల ప్రక్కవెంట డేరాలతో తాత్కాలిక గుడారాలను ఏర్పరచుకొని దినసరివేతనాలకు పనిచేయడం జరుగుతుంది.
పట్నాలలో ఎక్కువగా ఇళ్ల నిర్మాణంలో కూలీలుగా పని లభిస్తుంది. దానికోసం పొద్దునే లేచి, పనులు ముగించుకోని ఉదయాన్నే రోడ్డు మీదికి వచ్చి గుంపు గుంపులుగా నిలబడి పనికోసం వేచి చూస్తారు, ఆ అడ్డా దగ్గరికే మేస్త్రీలు వచ్చి వారికీ కావాల్సినంత మందిని కూలీకి తీసుకెళ్ళతారు. ఒక్కొక్కసారి కొంతమందికి పని లభించకపోయిన ఆశ్చ్చర్య బోనక్కర్లేదు. పట్నానికి దగ్గరలో వుండే తోటలలో, వివిధ పార్కులలో, షాపులలో, ఫ్యాక్టరీలలో, కంపెనీలలో, భిన్న చోట్ల సహాయక వ్యక్తులుగా, వాటర్ పెట్టడానికి, ఊడవడానికి, విభిన్న రకాల పనులను వెతుక్కోవడం జరుగుతుంది.
మహిళలు ధనవంతుల , వ్యాపారస్తుల , ఉద్యోగుల ఇళ్లలో వంట మనుషులుగా, పిల్లలను చూసుకోవడానికి, పని మనుషులుగా చేస్తుంటారు. మగవారికి నిర్మాణ రంగంలో, మూటలు మోయడానికి,ఇళ్లకు రంగులు దిద్దడానికి, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, కాపలాదారులుగా ఉండటానికి, భిన్న రకాల పనులను చూసుకుంటూ, చేసుకుంటూ వుంటారు. ఏదైతేనేమి గ్రామాలలో కంటే పట్నాలలో ఏవో ఒక రకమైన పనులు లభించిన, వారిచ్చే వేతనాలు సరిపోగా అష్టకష్టాలపాలు కావడం, దీనికితోడు రోజురోజుకు అన్నిట్లా ధరలు పెరగడం మూలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితి దాపురిస్తుంది.
పట్టణాలలో దినసరివేతనాలకు పనిచేసే కూలీలకు నెలంతా పని దొరుకుతుందనే నమ్మకం లేకపోగా, చేసిన రోజుల్లో సైతం అరకొర వేతనాలతో, పబ్బం గడుపుతున్నారు. పీల్చేగాలిని తప్పా ! మిగతా అన్నింటికీ కొంత ధర చెల్లిస్తే గానీ దొరకని పరిస్థితి, ఇంట్లోకి వంట సరకులు, నీళ్ళు, ఫోన్ల రీఛార్జ్, టీవీ బిల్లు, బట్టలు, చార్జీలు, పిల్లల ఖర్చులు ఇలా ఎన్నో రకాల ఖర్చులతో ఇబ్బందులను ఎదుర్కొంటూ పూట గడుపుతున్నారే తప్పా ! ఎలాంటి ఆదాయాన్నీ భద్రపర్చులేకపోతున్నారు.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
- పట్టణాలకు గ్రామీణ వలసలను ఆపాలి, అక్కడే ప్రభుత్వం తరుపున జాతీయ ఉపాధి హామీ పథకాలను కట్టుదిట్టం చేస్తూ, పలువురికి ఉపయోగకరమైన పనులు చేయిస్తూ, నేటి ఖర్చులను పరిగణలోకి తీసుకోని దినసరి వేతనాలను పెంచి, ఎక్కువ రోజులు పనిని కల్పించేందుకే కృషిచేయాలి.
- పట్టణాలలో సైతం దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద ప్రజలకు ప్రభుత్వం జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్నీ ప్రారంభించి , చెట్లను నాటడమే, నాటిన చెట్లకు నీళ్ళు పోయడమో, పరిశుభ్రతకు సంబంధించిన పనులను కల్పిస్తూ, పట్టణ ఖర్చులను చూసి, దినసరి వేతనాలను ఇవ్వాలి.
- పక్కా ఇళ్ళు లేనివారికి, మురికి వాడలలో నివసించేటటువంటి పేదలపై సర్వేలు నిర్వహించి, ప్రభుత్వ స్థలాలలో వారికి ప్రభుత్వమే తమ స్వంత ఖర్చుతో పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలి.అలాగే పట్టణాలలో విధించే పన్నుల నుండి ఇలాంటి పేదలకు రాయితీలనివ్వాలి.
- ప్రభుత్వ పరంగానే ఒక వ్యవస్థను రూపొందించి కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న వస్తువులను తయారుచేసే కంపెనీలను ప్రారంభించి, పట్టణ పేదలకు అందులో పనిచేసే అదృష్ట్యాన్ని కల్పించాలి.
- వారి పిల్లలకు ఉచితంగా నాణ్యతమైన విద్య, వైద్య సదుపాయాలను కల్పించి, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంటుంది.
- పెరుగుతున్న ధరలను అర్ధం చేసుకోని, ప్రభుత్వమే నేరుగా కల్పించుకోని మహిళలకు, పురుషుల యొక్క దినసరి వేతనాలను పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది .
- పట్టణాలలో వుండే పేదవారిపై అధికారులు, వ్యాపారస్తులు, ధనవంతులు ఎలాంటి ఆజమాయిషీ చేయకుండా, వారిని గౌరప్రదమైన మాటలతో సంబోదించే విదంగా చర్యలు తీసుకోవాలి.
ముగింపు
పట్టణాలంటేనే వ్యాపారానికి పుట్టినిల్లు , ధనవంతులు స్థాపించే వ్యాపారాలలో పనులు చేయాలంటే కూలీలు చేయాల్సిందే. అలాగే ఇంటిపని, వంటపని, తోటపనులు చేయడానికి, ఇంటి కాపలకాయడానికి, ధనవంతులు చేసుకోలేని ప్రతి పనిని పేదవారే చేస్తారనడం నిజం, ఒక వారం రోజులు తాము చేసే పనులను ఆపితే కడుపు మండి, కంపు వాసనలో కొట్టుకుపోతారు. అందుకోసం ప్రభుత్వం, పట్నాలలో వుండే ప్రతి ఒక్కరు వీరిపట్ల దయానుగుణంతో మెలుగుతూ గౌరవాలను ఇచ్చి పుచ్చుకుంటూ మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యావత్తు సమాజం, ధనవంతులు, వ్యాపారస్తులు, ప్రభుత్వం పట్నంలోని కూలీల పరిస్థితి, నేపథ్యాన్నీ అర్ధం చేసుకోని, వారి భవిష్యత్ కు ఒక మంచి మార్గం చూపడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం.