టీడీపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి!

352
Lakshmi

చిత్తూరు (ఆంధ్రజ్యోతి): నామినేషన్లకు గడువు ముంచుకొస్తుండడంతో అభ్యర్థుల్ని ఖరారు చేయడంపై టీడీపీ కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి ఎంపీ స్థానానికి పనబాక లక్ష్మి లాంటి బలమైన అభ్యర్థినే ఖరారు చేసింది.తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులతో పార్టీ సమన్వయ కమిటీ చివరి విడతగా అభిప్రాయాల్ని సేకరించింది. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు నగరి, మదనపల్లె, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో కూడా రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.జీడీనెల్లూరు నాయకులతో అమరావతిలో చంద్రబాబు నేటి సాయంత్రం విడివిడిగా మాట్లాడనున్నారు.

నామినేషన్లకు గడువు మిగిలిందిక ఐదు రోజులే. ఈ తరుణంలో అభ్యర్థలను ఎంపిక చేయడంలో తెలుగుదేశం పార్టీ కసరత్తు వేగం చేసింది. నిత్యం ఆయా నియోజకవర్గాల నాయకులతో అధిష్ఠానం అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఈ క్రమంలో తిరుపతి లోక్‌సభ స్థానానికి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్‌ నుంచి ఈమె నేడో రేపో టీడీపీలో చేరాక.. ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా టీడీపీ ప్రకటించనుంది. యూపీఏ పాలనలో మూడుసార్లు ఈమె కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఈమె 1996లో 11వ లోక్‌సభకు మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 12, 14, 15వ లోక్‌సభలకు ఎన్నికవుతూ వచ్చారు. ఈసారి తిరుపతి నుంచి పోటీచేస్తే ఇదే తొలిసారి అవుతుంది.

కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే.. 1984లో చింతా మోహన్‌, 1999లో పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి వెంకటస్వామి తిరుపతి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌.. 2014లో వైసీపీ గెలిచాయి. ఇన్నాళ్లు బలమైన అభ్యర్థిని బరిలోకి దించకపోవడం.. చివరి సమయంలో స్థానికేతరులను దించినా ఫలితం లేకపోవడం కారణాలు. ఈసారి కచ్చితంగా తిరుపతి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవాలనే లక్ష్యంతో టీడీపీ కసరత్తు చేసి బలమైన అభ్యర్థిగా పనబాక లక్ష్మి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈమె భర్త పనబాక కృష్ణయ్య స్వగ్రామం నెల్లూరు జిల్లా కోట మండలం వెంకనపాళెం (గూడూరు నియోజకవర్గం) తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉండటం గమనార్హం.

ఆ రెండింటికి ముగిసిన అభిప్రాయ సేకరణ
తంబళ్లపల్లె, శ్రీకాళహస్తి నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుపై నలుగురు సభ్యులతో కూడిన కమిటీ మంగళవారం చివరి విడతగా అభిప్రాయాల్ని సేకరించింది. తంబళ్లపల్లె విషయాన్ని తేల్చేసేందుకు అధిష్ఠానం నుంచి సోమవారం పిలుపు రాగా.. ముఖ్య నాయకులంతా వెళ్లారు. అమరావతిలో మంగళవారం యనమల రామకృష్ణుడు, సుజనా చౌదరి, టీడీ జనార్దన్‌, వర్ల రామయ్య సభ్యులుగా ఉన్న కమిటీ విడివిడిగా నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకుంది. ఆరు మండలాలకు చెందిన సుమారు 22 మంది నాయకులతో మాట్లాడి, శంకర్‌కే మళ్లీ టికెట్‌ ఇచ్చేందుకు అనుకూలతలు, ప్రతికూలతల గురించి ఒకటికి రెండుసార్లు క్రాస్‌ చేసుకుంది. సేకరించిన వివరాలను సీఎంకు నివేదిస్తాం… వేచి ఉండమని కమిటీ చెప్పడంతో వారంతా అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత అదే కమిటీ శ్రీకాళహస్తికు సంబంధించిన అభిప్రాయాల్ని కూడా తీసుకుంది. ఈ రెండు చోట్లా అభ్యర్థుల్ని రెండు మూడు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. సుధీర్‌ రెడ్డికే టికెట్‌ వచ్చిందంటూ ఆయన అభిమానులు మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తిలో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

 




 

 

జీడీనెల్లూరు నేటికి వాయిదా..పదే పదే వాయిదా పడుతూ వస్తున్న జీడీనెల్లూరు పంచాయితీ తేల్చేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయా ముఖ్య నేతలకు సమాచారం వచ్చింది. అంతవరకు స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి కుతూహలమ్మ.. తన కుమారుడు హరికృష్ణకు టికెట్‌ దక్కడం లేదనే సమాచారం అందడంతో, తనకే టికెట్‌ ఇవ్వాలని అడిగేందుకు రెండు రోజుల కిందట అమరావతి వెళ్లారు. ఈమెకు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మద్దతు ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గాంధీ, కొత్త వ్యక్తి తనూజ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. కుతూహలమ్మకు కాకుంటే.. గాంధీ పేరును పరిశీలించే అవకాశాలున్నాయి. ఆయన చిత్తూరు ఎంపీ స్థానాన్ని ఆశిస్తుండడంతో మూడో స్థానంలో పోటీలో ఉన్న తనూజను కూడా పరిశీలిస్తారు.

మరింత బలంగా చిత్తూరు టీడీపీ
చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ మరింత బలాన్ని పెంచుకుంటోంది. ఇటీవల కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నప్పుడు పార్టీ బలహీనపడిందని పలువురు భావించినా.. తాజా ఘటనతో టీడీపీ అంతకంటే ఎక్కువగా బలపడిందని చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, బీసీ నేత రావూరి ఈశ్వరరావులు మంగళవారం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. అంతవరకు ఏదో ఒక పార్టీలో టికెట్‌ ఆశించిన మరోహర్‌, ఇక నుంచి టీడీపీ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తానంటున్నారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న మనోహర్‌ చిత్తూరు మునిసిపల్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 1994, 1999, 2004లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీ టికెట్‌ రాకపోవడంతో అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ చొరవతో తిరిగి టీడీపీలో చేరారు. ఏఎస్‌ మనోహర్‌తోపాటు ఆయన అనుచరులు సుమారు 20 మందికి పైగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మేయర్‌ కఠారి హేమలత, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాజూరు బాలాజి, నేతలు డీఏ శ్రీనివాస్‌, కఠారి ప్రవీణ్‌, రావూరి ఈశ్వర్‌రావు, వినోద్‌, విశ్వనాథ్‌ తదితరులు వున్నారు.