హైదరాబాద్: పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు వెళ్తున్నారా? పారాహుషార్! బిల్లు ఇచ్చిన వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారా? అయితే ఒక్కనిమిషం మీ బిల్లును పరిశీలించండి. అందులో మీకు తెలియకుండానే కొన్నిరకాల పన్నులు, ఇతర వసూళ్లు ఉండొచ్చు. తాజాగా నగరంలోని బిగ్‌బజార్‌లో ఓ కొనుగోలుదారుడికి ఎదురైన సంఘటనతో షాక్‌కు గురయ్యాడు. తాను కొనుగోలుచేసిన వస్తువులతోపాటే బిల్లులో 2రూపాయలు చిల్డ్రన్ ఫండ్ పేరుతో వసూలుచేయడాన్ని గమనించి ఇదేమని అడిగితే ప్రభుత్వం వసూలు చేయమందని సమాధానం వచ్చింది.
చిల్డ్రన్స్ ఫండ్ పేరుతో…
విషయానికి వస్తే అమీర్‌పేటలోని పేరెన్నికగన్న బిగ్‌బజార్ మాల్‌లో షాపింగ్ చేసిన వారి నుంచి వారికి తెలియకుండానే బిల్లులో రెండు రూపాయల అదనపు మోత మోగుతోంది. చాలా మంది కస్టమర్లు దీనిని గమనించకపోయినా కొందరు మాత్రం ఈ దోపిడీని ప్రశ్నిస్తున్నారు. కస్టమర్లకిచ్చే బిల్లులోనే వస్తువుల జాబితాలో చిల్డ్రన్స్ ఫండ్ పేరుతో మరో 2రూపాయలు వసూలుచేస్తున్నారు. ఇలా కస్టమర్ల నుంచి చిల్డ్రన్స్ ఫండ్ వసూలుచేయడం పై కొనుగోలు దారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇదేంటి? మాకు తెలియకుండా ఎలా వసూలు చేస్తారు? అంటూ అక్కడి సిబ్బందిని అడిగితే కేంద్ర ప్రభుత్వసెస్ అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి పన్ను ఏదైనా వసూలు చేయాలని ఆదేశిస్తే అన్నిమాల్స్ వాళ్లు దానిని అమలు చేస్తారు. కానీ నగరంలోని మిగిలిన ఏ షాపింగ్‌మాల్‌లో ఇలాంటి వసూలు జరగడం లేదు. కేవలం బిగ్‌బజార్ షోరూమ్‌లలోనే జరుగుతోంది. ఇదే అంశాన్ని బిగ్‌బజార్ కస్టమర్ కేర్‌లో వాకబు చేస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని, ఆటోమేటిక్‌గా కంప్యూటర్ ద్వారా జనరేట్ అవుతుందని చెబుతున్నారు. ప్రతి 200 రూపాయలకు పైబడిన బిల్లుల్లో ఇలా రెండు రూపాయలు చిల్డ్రన్‌ఫండ్‌పేరుతో వసూలు చేస్తున్నట్టు వారు తెలిపారు.
ఒకవేళ బిగ్‌బజార్ యాజమాన్యమే సేవా కార్యక్రమాల కోసం ఇలా వసూలు చేసేట్టయితే కొనుగోలుదారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ వారు రెండు రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడకపోతే బిల్లులో వసూలు చేయకూడదు. మరే ఇతర సూపర్ మార్కెట్‌లు, మాల్స్ వసూలు చేయని చిల్డ్రన్స్ ఫండ్ గురించి తూనికలు కొలతల శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇలాంటి ఫండ్ ఏదీ వసూలుచేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ బిగ్‌బజార్‌లో మాత్రం కస్టమర్స్ కొనుగోలుచేసే వస్తువుల జాబితాలోనే చిల్డ్రన్ ఫండ్‌ను పేర్కొంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయమే అయితే బిల్లులో ట్యాక్స్ జాబితాలో దీనిని పేర్కొనే అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా విడిగా వసూలు చేయడంపై కొనుగోలు దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు వేల సంఖ్యలో కొనుగోలు దారుల నుంచి ఇలా చిల్డ్రన్స్ ఫండ్‌పేరుతో చేసే వసూళ్లు నెలకు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఇదే బిల్లులో వేరే వస్తువుకు సంబంధించి 30 తేడా పడింది. 60రూపాయల కొనుగోలు చేస్తే దానికి 90 రూపాలుగా బిల్లులో చూపించారు. ఇదేమని అడిగితే బిల్లులో తప్పుపడిందని చెప్తూ తిరిగి 30 రూపాయలు వాపస్ ఇవ్వడం గమనార్హం. ఇలా ఎంతో నమ్మకంతో వెళ్లే వారికి కొన్నసంస్థలు ఇలాంటి షాక్‌లు ఇవ్వడంపై కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లు సరిగ్గా చూసుకోని వారెందరో ఇలాంటి వసూళ్ల వల్ల నష్టపోతున్నట్టు స్పష్టమవుతోంది.