అమ్మాయిలూ జీన్స్‌, టీష‌ర్ట్ వేసుకోవ‌ద్దు

312

ఒక‌ప్పుడు అమ్మాయిలు సంప్ర‌దాయ‌బ‌ద్ద‌మైన లంగా ఓణి వేసుకునే వారు. ఆ క‌ట్టు బొట్టులో చూడ్డానికి చ‌క్క‌గా అందంగా క‌నిపించేవారు.

ఆ త‌ర్వాత గీతాంజ‌లి సినిమా త‌ర్వాత చుడీదార్‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత విదేశీ సంప్ర‌దాయం వ‌చ్చింది.

దీంతో ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్‌, టీషర్ట్ ధ‌రిస్తున్నారు.

ఇలాంటి డ్ర‌స్ వేసుకోక‌పోతే వెన‌క‌బ‌డి ఉన్నామ‌న్న భావ‌న ఇత‌రుల‌కు క‌లుగుతుంద‌ని కూడా అమ్మాయిలు అనుకుంటారు.

అయితే ఈ రోజుల్లో చిన్నా, పెద్ద, ఆడ, మ‌గ అనే తేడాలేకుండా అంద‌రూ జీన్స్ వేసుకుంటున్నారు.

అయితే అమ్మాయిలు జీన్స్ వేసుకోవద్దంటూ ఓ పంచాయితీ ఆదేశాలు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన క్షత్రియ పంచాయతీ కొత్త ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై అమ్మాయిలు జీన్స్‌ ధరించకూడ‌ద‌ని తీర్మానించింది. ఈ కట్టుబాటును కాదని ఎవరైనా జీన్స్ ధ‌రిస్తే సంఘ బహిష్కరణ విధిస్తామని హెచ్చ‌రించింది.

అలాగే అబ్బాయిలు కూడా నిక్కర్లు ధరించవద్దని హుకుం జారీ చేసింది. ఒక‌వేళ ధ‌రిస్తే వారికి కూడా ఇదే శిక్ష ఉంటుంద‌ని స్పష్టం చేసింది.

అమ్మాయిలు జీన్స్‌ ధరించి తిరుగుతుండటం వల్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని పంచాయతీ పెద్దలు అభిప్రాయ‌ప‌డ్డారు.

అమ్మాయిలు జీన్స్‌ ధరించకుండా చూడాల‌ని కొందరు చేసిన సూచనల మేరకు మంగళవారం క్షత్రియ పంచాయతీ సమావేశమైంది.

దీనిపై సుదీర్ఘంగా చర్చించి నిషేధం నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. క్షత్రియ కులం గౌరవ మర్యాదలను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పెద్దలు తెలిపారు.

అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించాలని పెద్ద‌లు సూచించారు.

అమ్మాయిలు జీన్స్ ధ‌రించ‌రాదు అబ్బాయిలు నిక్కర్లు వేసుకోరాదు అన్న‌ ఈ కట్టుబాట్లను అతిక్రమించిన వారికి తొలుత జరిమానా విధిస్తామన్నారు.

ఎక్కువసార్లు పాల్ప‌డితే సంఘ బహిష్కరణకు కూడా వెనుకాడమని హెచ్చరించారు.

అయితే ఈ పంచాయితీ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఆధునిక యుగంలోనూ ఇలాంటి కట్టుబాట్లు విధిస్తే స్వేచ్ఛను హరించడమే అంటూ కొందరూ వాదిస్తున్నారు.