హ్యాపీ సంక్రాంతి

879
happy-sankranthi

పన్నెండు మాసాల కాలంలో సూర్యుడు పన్నెండు రాశుల్లో – ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క మాసం ఉంటాడు. ఒక రాశిలోంచి మరో రాశిలోకి సంక్రమిస్తాడు. ఈ సంక్రమణనే ‘సంక్రాంతి’గా పేర్కొంటారు. అంటే… ఇలా సంవత్సరంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వీటిలో ధనూరాశి నుండి మకరరాశిలోకి సూర్యుడు సంక్రమణం చేయడానికి ‘మకర సంక్రాంతి’ గా పేరు. సంక్రాంతులన్నిటిలో మకరసంక్రాంతి ప్రాముఖ్యాన్నీ, పవిత్రతనూ సంతరించుకుంది.

మకర సంక్రాంతినాడు. ప్రకృతిలో మధురక్రాంతి సంభవిస్తున్నది. అది వెలుగుల విక్రాంతి. నాటి నుంచి సూర్యగమనం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలో సూర్యుని కాంతి క్రమంగా పెరుగుతూ అంతవరకు చలితో వణుకుతున్న ప్రజలకు సాంత్వన లభిస్తుంది. దీనిని భాగవతంలో పోతన ‘‘అహములు సన్నములయ్యెను- దహనము హితమయ్యె దీర్ఘ దశలయ్యె నిశల్‌- బహుశీతోపేతంబై- ఉహుహు అని వడకె లోకము’’ అని చక్కగా వర్ణించాడు.

వృశ్చిక రాశి నుండి ధనూరాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ‘ధనుస్సంక్రాంతి’. ఈ రాశిలో నెలరోజులు సూర్యుడు నివసిస్తాడు కనుక దీనిని ధనుర్మాసమని వ్యవహరిస్తారు. వాస్తవానికి ధనుర్మాసం నుండే సంక్రాంతి శోభ పరిఢవిల్లుతుంది. ప్రతి ఇంట్లో మహిళలు, ముఖ్యంగా కన్నెపిల్లలు వేకువనే లేచి ఇళ్ళ ముంగిట ఆవు పేడతో కళ్ళాపి జల్లి, అందంగా రంగవల్లికలు తీర్చి దిద్దుతారు. ఆకాశంలోని చుక్కలకు ప్రతీకగా చుక్కల ముగ్గులు, మధ్యలో కంటికింపుగా కనిపించే గొబ్బెమ్మలు, వాటిపై బంతి, చామంతి, గుమ్మడి పూల అలంకరణలు చేస్తారు. మేలుకొలుపు గానాలతో హరినామస్మరణ చేస్తూ హరిదాసులు, శివనామస్మరణతో జంగమయ్యలు, వారి వెనుక గంగిరెద్దులవారు ‘‘అయ్యగారికీ దండం పెట్టూ, అమ్మగారికీ దండం పెట్టూ’’ అంటూ గంగిరెద్దుల నాట్యం చేయిస్తారు. బుడబుడక్కులవారు, పగటివేషగాళ్ళు తమ కళాకౌశలాన్ని చూపిస్తూ వారి వెనుక వస్తారు. ఇదంతా ఒక కళా విలాసం.

హేమంతంలో వచ్చే సంక్రాంతి మూడు రోజుల పండుగ… భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి అంటే ప్రకృతిలో సంభవించే మంచి మార్పులు. ఆ మార్పులకు అనుగుణంగా నిర్వహించవలసిన విధివిధానాలను ద్రష్టలైన మన పూర్వీకులు ఘనంగా నిర్వచించారు.

మకర సంక్రాంతికి ముందురోజు భోగి. ఇది దక్షిణాయనానికి చివరిరోజు. అలాగే ధనుర్మాసానికి ఆఖరి రోజు. ఈనాడు తెల్లవారుజామునే లేచి ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఇంటి ముంగిట, కూడళ్ళలో భోగి మంటలు వేస్తారు. మాసమంతా పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి ఆ మంటల్లో వేస్తారు. అరిష్ట నివారణమన్నట్లు ఇళ్ళలో పనికిరాని వస్తువులను కూడా మంటల్లో వేస్తారు. నువ్వులనూనె రాసుకుని, నువ్వుపిండితో నలుగు పెట్టుకుని, మంటల వద్ద కాచిన వేడినీటితో అభ్యంగనం చేస్తారు. కొత్త దుస్తులు ధరించి పెద్దవారి దీవెనలు పొందుతారు. ప్రతి ఇంటిని పచ్చటి తోరణాలతో, గుమ్మాలకు పసుపు, కుంకుమలను అలంకరించి శోభాయమానంగా రూపొందిస్తారు.

ఈ సంక్రాంతి నాడు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు కనుక మకర సంక్రాంతి పుణ్యప్రదమైన రోజు. ముందురోజు మాదిరిగానే ఇంటిలోని వారందరూ విధిగా తలంటు పోసుకోవాలి. పుణ్యప్రదమైన ఈ రోజున గతించినవారికి తర్పణాలు వదలడం, వారి పేరున దానాలు ఇవ్వడం సంప్రదాయం. గుమ్మడిపండు, నువ్వులు, వస్త్రాదులు దానమివ్వాలని శాస్త్ర ఉవాచ.

మరుసటి రోజు కనుమ. ఇది ప్రధానంగా వ్యవసాయదారుల పండుగ. పశువుల పండగ అని కూడా అంటారు. తమ వ్యవసాయ సంపదకు కారణభూతమైన భూమాతకు, గో సంపదకు, పాలేళ్లకు, పక్ష్యాదులకు కృతజ్ఞత తెలియజేయడం ఈ పండుగలోని ఆంతర్యం. పశువులశాలలను శుభ్రం చేసి, పశువులను కడిగి, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గజ్జెలు, పూలదండలతో అలంకరిస్తారు. కొత్త బియ్యంతో పొంగలి వండి నివేదించి, తీపి పదార్థాలతోపాటు పశువులకు దాణాగా వేస్తారు. ఆ పొంగలిని తమ పొలాల్లో చల్లుతారు. దీన్ని ‘పొలి చల్లటం’ అంటారు. ముక్కనుమను మూడు రోజుల సంక్రాంతి పండుగలో చేర్చకపోయినా అది ప్రాముఖ్యమున్న పండుగ. ఈ రోజున నవ వధువులు సమష్టిగా సావిత్రీగౌరీదేవి వ్రతం చేపడతారు. పదహారురోజులపాటు చేసే ఈ వ్రతంలో ప్రధానంగా పల్లెసీమల్లో ఆడవారందరూ పాల్గొంటారు.

సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది ‘భోగి’ పండుగ. భోగి అంటే ‘తొలినాడు’ అనే అర్ధం ఉంది. భోగిరోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామున భోగిమంటలు వేయటం సాయంత్రం భోగిపండ్లు పోయించుకోవడంతో పిల్లలు హుషారుగా ఉంటారు. ‘భగ’ అనే పదం నుంచి భోగి అన్నమాట పుట్టిందని చెబుతారు. ‘భగ’ అంటే ‘మంటలు’ లేదా ‘వేడి’ని పుట్టించడం అని అర్ధం.

ఈభోగి సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడినిగా భావిస్తారు. రేగిపళ్ళను సంస్కృతంలో బదరీఫలం అంటారు. భోగిపళ్ళలో చేమంతి బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం పూర్వం ఈరోజున శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగిపండగ ఆచరణలోకి వచ్చిందని పురాణ గాధ. అయితే చాలామంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా.

ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు మనలోని పనికి రాని అలవాట్లు చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. ఈభోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు నువ్వుల లడ్డు జంతికలు చక్కలతో పాటు రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది. ఈ భోగి పండుగ సదర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తీన్ మార్ శుభాకాంక్షలు తెలియచేస్తోంది..