హైదరాబాద్ నగరంలో ఓ కారు అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్థంబాన్ని ఢీకొట్టింది.
దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వనస్థలిపురం పోలిస్ స్టేషన్ పరిధి హస్తినపురంలో శనివారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
మద్యం మత్తులో డ్రైవింగ్ చేయగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
మితిమీరిని వేగంతో వెళ్తున్న కారు హస్తినాపురం వద్ద అదుపుతప్పి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టింది. డివైడర్‌ను దాటుకుని రోడ్డుకు అవతలివైపు ఉన్న బారిడ్లపైకి ఎక్కి ఆగిపోయింది.
ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా…మరో యువకుడు పరారయ్యాడు. గౌతమ్ అనే యువకుడు కారును నడుపుతున్నాడు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గౌతమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.