
మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. అయిన దానికి కాని దానికి మానవుడు దానవుడిలా తయారవుతున్నాడు.
ఇంటి అద్దె అడిగినందుకు యజమానిని చంపేశాడో ఓ వ్యక్తి. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ముచ్చర్లవారివీధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే… ఇంటి అద్దె అడిగాడన్న కోపంతో ఓనర్ వంగా ప్రసాద్‌ను.. కిరాయికి ఉన్న వ్యక్తి అడపా చినకొండయ్య కిరాతకంగా హతమార్చాడు.
ముచ్చర్లవారివీధిలోని వంగా ప్రసాద్ (50) ఇంట్లో ఏడాది కాలంగా చినకొండయ్య నివాసముంటున్నాడు. చినకొండయ్య రెండు నెలలుగా ఇంటి అద్దె ఇవ్వడం లేదు.
ఈ విషయమై ఇంటి యజమాని, చిన కొండయ్య మధ్య సోమవారం రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన చినకొండయ్య పక్కనే ఉన్న రాయితో ఓనర్ తలపై కొట్టాడు.
తీవ్ర రక్తస్రావమైన యజమాని ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం చినకొండయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట్ మండలం మెట్లకుంటలో మరో దారుణం జరిగింది. కుర్వ చంద్రయ్య (52)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు.
డెడ్‌బాడీ చూసిన స్థానికలు కంగుతిన్నారు. హత్య అనంతరం దుండగులు తలను, మొండెంను వేరు చేశారు. తలను చెరువులో, మొండెంను పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో పడేశారు.
ఆదివారం పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గాలింపు చేపట్టిన పోలీసులు మెట్లకుంట ఎల్లమ్మ చెరువు వద్ద చంద్రయ్య మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
చంపివ విధానాన్ని బట్టి చూస్తే .. మనసులో బాగా కక్ష పెట్టుకుని ప్లాన్ చేసి మరీ మర్డర్ చేసినట్లు అర్థమవుతోంది.
ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. క్షణికావేశంలో చేసే హత్యలు కుటుంబాల పాలిట శాపంగా మారుతున్నాయి.