మనలో అధికశాతం మందికి పులిపిరికాయలు ఉంటాయి. నిజానికి ఇది చాలా సాధారణ సమస్యగానే చెప్పవచ్చు. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలని, వార్ట్స్ అని పిలుస్తారు. ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వస్తాయి. ఎక్కువగా యుక్త వయస్సులో ఉండే వారికే పులిపిరి కాయలు వస్తుంటాయి. అయితే పురుషుల కంటే స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పులిపిరి కాయలు చూసేందుకు చర్మపురంగులో కానీ, ముదురు గోధుమ రంగులో కానీ బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. అయితే ఇవి నొప్పిని మాత్రం కలిగించవు. కానీ ఒత్తిడి పడేచోట ఇవి వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి. ఈ క్రమంలోనే పులిపిరులను తగ్గించుకోవాలంటే అందుకు మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లి రెబ్బలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణాల వల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి.
2. ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని స్పూన్‌తో తొలగించి సముద్రపు ఉప్పుతో అందులో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దాన్ని తీసి నిల్వ చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన రాస్తుంటే ఫలితం ఉంటుంది.
3. పులిపిరులకు ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పులిపిరి కాయలు తగ్గుతాయి.
4. ఉత్తరేణి మొక్క ఆకులను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన రాయాలి. తరచూ రాస్తుంటే పులిపిరులు తగ్గుతాయి.
5. కొత్త సున్నాన్ని పులిపిరులపైన రాస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టు పక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు వస్తాయి.
6. విటమిన్-ఎ, విటమిన్-సి ఉన్న పదార్థాలను పైపూతగా రాస్తుంటే పులిపిరికాయలు తగ్గుతాయి.