సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 ట్రైలర్ విడుదల

645
trailer released
dabangg3 trailer released

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ దబాంగ్3. స‌ల్మాన్ ఖాన్‌, అర్బాజ్‌ఖాన్‌, నిఖిల్ ద్వివేది ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాక్షి సిన్హా, సయీ మంజ్రేకర్ లు కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుదల చేశారు.

దబాంగ్ 3 సినిమా హైలైట్స్

మూడు నిమిషాలు సాగిన ఈ ట్రైలర్‌లో.. ప్రజెంట్‌, ప్లాష్‌బ్యాక్‌ పాత్రల్లో సల్మాన్‌ తనదైన నటనను కనబరిచారు. కామెడీతోపాటు, ఎమోషన్స్‌తో కూడిన ఈ ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చుల్‌బుల్‌ పాండేగా మరోసారి సల్మాన్‌ మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా హిందీతో పాటు తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.

దబాంగ్ ట్రైలర్ ను ఆన్ లైన్ లో విడుదల చేయటమే కాకుండా ముఖ్య నగరాలైన దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ జైపుర్ కోల్ కతా, అహ్మదాబాద్, ఇండోర్, లక్నో నగరాల్లోని వివిధ థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించారు.

తొలి చిత్రానికి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా, రెండో చిత్రానికి అర్బాజ్ ఖాన్, ఈ మూడవ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభుదేవా-సల్మాన్ కాంబినేష‌న్‌లో గతంలో వాంటెడ్ (పోకిరి రీమేక్‌)తో విజయాన్ని అందించిన ప్రభుదేవా.. దబాంగ్‌ 3తో మరో హిట్‌ను అందిస్తారని అంతా భావిస్తున్నారు. వీరి కాంబినేషన్ లోనే రాధే సినిమా రాబోతోంది.

దబాంగ్ లో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఫ్లాష్ బ్యాక్ లో సయీ మంజ్రేకర్ ఆడిపాడనుండగా, తొలి రెండు పార్టుల్లో స‌ల్మాన్ స‌ర‌స‌న న‌టించిన సోనాక్షి సిన్హానే ఈ చిత్రంలో కూడా సల్మాన్ భార్యగా నటించనుంది. మహేష్ మంజ్రేకర్ మళ్లీ సోనాక్షి తండ్రిగానే తెరపై కనిపించనున్నారు.

దబాంగ్ సిరీస్ మొదటి రెండు చిత్రాల్లో నటించిన వారే మళ్లీ మూడో చిత్రంలోనూ నటిస్తున్నారు. చుల్ బుల్ పాండేగా సల్మాన్, రజ్జోగా సోనాక్షి సిన్హా, సల్మాన్ సోదరుడిగా అర్బాజ్, మేనకోడలిగా మహిగిల్ లు నటిస్తుండగా, డింపుల్ కపాడియా చుల్ బుల్ కు తల్లిగా కనిపించనుంది.

ఈ చిత్రంతోనే బాలీవుడ్ నటుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సయీ మంజ్రేకర్ కథానాయికగా పరిచయం అవుతోంది. సల్మాన్ యువకుడిగా ఉన్న పాత్రకు ప్రియురాలిగా కనిపించనుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఓ ల‌వ్‌స్టోరీ ఉన్న‌ట్లు ట్రైల‌ర్ లో చూపించారు.

గత చిత్రాల్లో సల్మాన్ తండ్రిగా చేసిన వినోద్ ఖన్నా కన్నుమూయడంతో ఆయన స్థానంలో ప్రమోద్ ఖన్నా నటిస్తున్నారు. ద‌బంగ్‌ 1 లో సోనూసూద్‌, ద‌బంగ్ 2లో ప్రకాశ్ రాజ్ విల‌న్స్‌గా న‌టించ‌గా ద‌బంగ్ 3లో క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ విల‌న్‌గా కనిపించనున్నారు.

దబాంగ్ 3 లోనూ ప్రత్యేక గీతం ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమా డిసెంబరు 20 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.